ఎల్.బి.నగర్, నాగోల్ ప్రాంతాలలోని గణేష్ విగ్రహా తయారీ కేంద్రాలను ఈరోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్ సందర్శించి, విగ్రహా తయారీదారులతో ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలపై వారితో చర్చించారు. ఈసందర్భంగా రావినూతల శశిధర్ మాట్లాడుతూ “10 సెప్టెంబర్ నుండి 19 సెప్టెంబర్ 2021 వరకూ భాగ్యనగరంలో 42 వ సామూహిక గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు చేస్తుందని, భాగ్యనగరంలో జరిగే గణేష్ ఉత్సవాలు ప్రపంచస్థాయిలో ప్రసిద్ది చెందాయని, కరోనా నిబంధనలు పాటిస్తూనే ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఉత్సవ సమితి నిర్వాహకులకు పిలుపునిస్తుందన్నారు.
ఉత్సవాల కోసం విగ్రహాలు యధావిధిగా రూపు దిద్దుకుంటున్నాయని , గత సంవత్సరం కరోనా కారణంగా విగ్రహా తయారీదారులు తీవ్ర నష్టాలకు గురైనారని వారిని ప్రభుత్వం మరియు సమాజం ఆదుకోవాలి, సమాజం జరుపుకునే ఇంతపెద్ద ఉత్సవంలో విగ్రహా తయారీదారులు పాత్ర పెద్దదని తెలిపారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఈ సంవత్సరం జరగనున్న వినాయక చవితి మరియు దుర్గామాత ఉత్సవాల కోసం విగ్రహాలు రూపొందిస్తున్న విగ్రహా తయారీదారుల సేవలు వెలకట్టలేనివని తెలిపారు.
వివిధ ప్రభుత్వ పథకాలను విగ్రహా తయారీదారులకు వర్తింపజేసేలా ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. విగ్రహా తయారీదారులపై పోలీసులు, రెవిన్యూ, GHMC అధికారులు వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు గతంలో వెలుగు చూశాయని , అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని శశిధర్ కోరారు. ఈకార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎల్.బి.నగర్ అసెంబ్లీ కమిటి సభ్యులు K . శ్రీనివాస్, హరి, సురేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు .