రాష్ట్రంలో పాదయాత్రలు, చైతన్య యాత్రలతో హడావిడి మొదలైంది. ఇప్పటికే బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో తొలిదశ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వైఎస్ షర్మిలా కూడా పాదయాత్ర చేస్తుండగా.. ఇప్పుడు రంగంలోకి కాంగ్రెస్ పార్టీ కూడా ఎంటర్ అయ్యింది. కాంగ్రెస్ జన జాగరణ ప్రజాచైతన్య పాదయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టేందుకు తేదీలను కూడా ఖరారు చేసింది. ఈ నవంబర్ 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కాంగ్రెస్ జన జాగరణ ప్రజా చైతన్య పాదయాత్ర ఉంటుందని ఏఐసీసీ కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్ల పర్మిషన్లు తీసుకొని యాత్రలు చేయాలని కాంగ్రెస్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందన.. కోడ్ నిబంధనలకు లోబడి ఈ యాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కాగా, అధికార పార్టీ చేపట్టిన ధర్నాకు కరోనా నిబంధనలు కానీ.. కోడ్ నిబంధనలు కానీ ఉండవా అంటూ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. 31 జిల్లాలకు 50 నుంచి 60 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఇంఛార్జిలుగా నియమించగా.. డీసీసీ ప్రెసిడెంట్లు కన్వీనర్లుగా ఉంటారన్నారు.