హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి మందిరం నుంచి ప్రారంభమైన యాత్ర 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 25 రోజుల్లో 300 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఉన్నారు. ఆరు జిల్లాల్లోని 17 శాసనసభా నియోజకవర్గాల్లో ప్రజాసంగ్రామ యాత్ర సాగింది. అనేక మంది జాతీయ నాయకులు పాదయాత్రలో ప్రతీరోజు సంఘీభావం చెప్పడానికి , పాదయాత్రకు మద్దతుగా తరలివచ్చారు .
ప్రతీ రోజు వేలాది మంది కార్యకర్తలు , ప్రజలతో నడిచే దారుల వెంట రైతులు, కూలీలు, వ్యాపారస్తులు ఇతరుల సమస్యలు, ప్రభుత్వ ఫలితాలపై నేరుగా కష్ట, నష్టాలు తెలుసుకుంటున్నారు బండి సంజయ్. పార్టీ రాష్ట్ర, జిల్లాల నాయకులు, కార్యకర్తలు వేలాదిగా ఆయన వెన్నంటి నడుస్తున్నారు. జాతీయ పార్టీ నాయకులు, అగ్ర నాయకుడు అమిత్ షా ఏకంగా నిర్మల్ లో బహిరంగ సభకు హాజరయ్యి, తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ మీద వ్యతిరేకత బండి సంజయ్ పాదయాత్రలో స్పష్టంగా కనిపిస్తోందని, బండి సంజయ్ యాత్ర ద్వారా తెలంగాణలో పార్టీ ప్రభుత్వంలోకి రావడం ఖాయమనే నమ్మకాన్ని తెలిపారు.
ప్రతీ రోజు తెలంగాణలో కేసీఆర్ సర్కారు వైఫల్యాలను, ఇచ్చిన మాటలను తప్పిని విధానాన్ని ప్రజలకు వివరిస్తూ , ప్రజలు అనుభవిస్తోన్న బాధలను వింటూ ఓదారుస్తూ, భవిష్యత్తులో బీజేపీ సర్కారు వచ్చి ప్రజల కష్టాలను దూరం చేస్తుందనే భరోసా కల్పిస్తున్నారు బండి సంజయ్. అక్టోబర్ రెండున హుజూరాబాద్ లో పాదయాత్ర ముగియనుంది.