రాష్ట్రంలో అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన నగరంలోని విద్యానగర్ శంకర్‌మఠాన్ని సందర్శించారు. రాష్ట్రంలో చాలా దేవాలయాలు దూప,దీప నైవేద్యాలకు నోచుకోవడం లేదని.. ప్రభుత్వం వెంటనే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని పునఃప్రతిష్టించడంపై స్పందించారు. గతంలో కేదార్నాథ్ వరద బీభత్సంలో ఆదిశంకరుడి విగ్రహం కోట్టుకుపోయిందని.. నేడు ప్రధాని మోదీ ధృడసంకల్పంతో దానిని తిరిగి పునఃప్రతిష్టించి.. పూజలు నిర్వహించడం గోప్ప విషయమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం లేకుంటే ఇలాంటి పవిత్ర కార్యం జరగి ఉండేదా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు.. అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం కానీ.. ఆర్టికల్ 370 రద్దు కానీ జరిగేదా అంటూ ప్రశ్నించారు. వీటిని మతకోణంలో చూడటమనేది మూర్ఖత్వమని.. 80 శాతం హిందువులు ఉన్న దేశంలో ధర్మం కోసం పనిచేస్తే మతతత్వం ఎలా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కుహానా లౌకిక శక్తుల ఆలోచనల నుండి బయటకు రావాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు.