బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రెండో రోజు కొనసాగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రసంగించారు. భారత్ మాతాకీ జై.. వందే మాతరం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆలస్యమయ్యాయని.. కరోనా విజృంభించిన వేళ.. మోదీ నాయకత్వంలో జేపీ నడ్డా ఆదేశంతో బీజేపీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందజేస్తున్న ప్రధాని మోదీకి దేశ ప్రజలంతా రుణపడి ఉన్నారని అన్నారు.
ప్రధాని మోదీ, జేపీ నడ్డాల ఆశీస్సులతో రాష్ట్రంలో ఉన్న కుటంబ, నియంత అవినీతి పాలనపై ఉద్యమిస్తున్నామన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రజల దృష్టి మరల్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని.. అసలు ఢిల్లీకి ఎందుకు పోయారో అర్ధం కావడం లేదని.. కేంద్రం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆత్మగౌరవమంటూ సెంటిమెంట్‌ను రాజేద్దామని కుట్రపన్నారని అన్నారు. అయితే సీఎం కేసీఆర్ ఎలాంటి అపాయింట్‌మెంట్ అడగలేదని పీఎంవో మీడియాకు చెప్పడంతో సీఎం కేసీఆర్ కుట్రలు ప్రజలకు అర్ధమైందని.. సొంత పనులకోసం సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ పేరుతో బీజేపీని అప్రతిష్టపాలు చేయాలని చూశారన్నారు. కాగా, సీఎం కేసీఆర్‌కు ఓ జ్యోతిష్యుడు కలిసి ఆయన రాజకీయ పతనం ప్రారంభమైందన్న విషయాన్ని తెలియజేశారన్నారు. ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని.. నువ్వు శిశుపాలుడువయ్యావని కేసీఆర్‌తో సదరు జ్యోతిష్యుడు చెప్పాడంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తనకు కూడా ఓ జ్యోతిష్యుడు కలిసి తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని పేదలకు న్యాయం జరగబోతుందని.. తెలంగాణ తల్లికి విముక్తి కలగబోతుందని తెలిపారని అన్నారు. అది కేవలం బీజేపీతోనే సాధ్యమన్న విషయాన్ని జ్యోతిష్యుడు చెప్పారని బండి సంజయ్ అన్నారు.