ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ విస్తరణపై కన్నేశారు. ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితమనే పార్టీ.. ఇటీవల మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో ఉనికిని చాటింది. దీంతో ఇక మరిన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరింపచేసేందుకు ప్రణాళికలను రెడీ చేసుకున్నట్లు అర్ధమవుతోంది. రాజస్థాన్‌లో పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో కూడా పార్టీని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. మరో 45 రోజుల్లో రాష్ట్రంలో పార్టీ ప్రారంభించి..2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతామన్నారు. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఓవైసీ ఈ విషయాన్ని వెల్లడించారు.
కాగా, ఇప్పటికే యూపీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఎంఐఎం పోటీ చేసి.. ఓట్లను సంపాదించుకున్నప్పటికీ సీట్లను గెలవలేకపోయింది. అయితే ఈ సారి మాత్రం రాజస్థాన్‌తో పాటుగా.. గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక,తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరింపచేసి.. జాతీయ స్థాయిలో ఎదిగే లక్ష్యంతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు అర్ధమవుతోంది.