ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘోరపరాజయం చూసిన టీఆర్ఎస్ పార్టీకి మరో చేధువార్త వినిపించింది. ఓటమి బాధను మర్చిపోయేలా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు వరంగల్లో విజయగర్జన సభను నవంబర్ 29వ తేదీన ఏర్పాటు చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే అక్కడ రైతులు విజయగర్జన సభకు తమ స్థలాలు ఇవ్వమంటూ గోడవకు దిగుతుండగా.. తాజాగా ఈసీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేపట్టడంతో ఎన్నికల కోడ్ రూపంలో సభకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలవుతుందని.. బహిరంగ సభలు, రాజకీయ సభకు అనుమతి లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఇచ్చిన మార్గదర్శకాలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. రాజకీయ సమావేశాలకు కూడా అనుమతి లేదన్నారు. డిసెంబరు 10వ తేదీన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరుగుతుందని.. 14వ తేదీన లెక్కింపు ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఈనెల 29వ తేదీన హనుమకొండలో జరగాల్సిన టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా పడింది.