తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఇక తాను తిరిగి సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానంటూ శపథం చేస్తూ.. అసెంబ్ల నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయనతో పాటుగా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సభను వాకౌట్ చేసి వెళ్లిపోయారు. కాగా, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మరుసటి రోజే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. రెండో రోజు సభ ప్రారంభమైనప్పటినుంచి ఇరు పార్టీల నేతలు నోటికి పనిచెప్తూ.. విమర్శలు చేసుకుంటూ రన్నింగ్ కామెంట్స్‌కు దిగారు. ఈ క్రమంలో చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్రపదజాలంతో మాటలు అనడంతో.. ఆవేదనకు గురైన చంద్రబాబు ఇక సీఎం అయ్యాకే మళ్లీ సభలోకి అడుగు పెడతానంటూ శపథం చేస్తూ బయటకు వెళ్లారు.
కంటతడి పెట్టిన చంద్రబాబు
అసెంబ్లీ సభ నుంచి వాకౌట్ చేసి ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు.. మీడియా సమావేశంలో కన్నీటిపర్యంతమయ్యారు. తాను మూడు దశాబ్ధాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు జరిగిన ఎదుర్కొని నిలబడ్డానని.. కానీ ఇలాంటి అవమానాలను తాను ఎన్నడూ ఎదుర్కోలేదని.. తన కుటుంబంలోని మహిళలపై అవమానకరంగా మాట్లాడుతుండటాన్ని తాను సహించుకోలేకపోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర మనస్థాపానికి గురై కంటతడి పెట్టారు. తాను ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులతో కలిసి పనిచేశానని.. జాతీయ స్థాయిలో కూడా అనేకమంది నాయకులతో పనిచేశామని.. కానీ గడిచిన రెండున్నరేళ్లుగా వైసీపీ శ్రేణుల తీరును ఎక్కడా కూడా చూడలేదన్నారు.