బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు.. కేసీఆర్ ఇచ్చే ఉపన్యాసాలకు బీజేపీ భయపడబోదన్నారు. సీఎం పదవికి మచ్చ తీసుకురావోద్దని.. హుందా తనాన్ని తగ్గించుకోకుండా ఉండాలని సీఎం కేసీఆర్కు సూచించారు. తాము ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని.. కల్లాల్లో ఉన్న ధాన్యం కొంటరా..? కొనరా..? అని ప్రశ్నించామన్నారు. అసలు ధాన్యం కొనడానికి సీఎంకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. సీఎం స్పందన లేకపోవడంతోనే.. బీజేపీ రైతుల దగ్గరికి వెళ్లిందన్నారు. రైతులు వారి బాధలను తమకు వివరిస్తుంటే.. టీఆర్ఎస్ నేతలు రాళ్లతో, కోడిగుడ్లతో దాడి చేశారన్నారు. టీఆర్ఎస్ నేతల దాడిలో 70 మంది బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారని తెలిపారు. ఇక ప్రజా సమస్యలపై మాట్లాడితే.. తమను వెంటాడుతానంటారా..?వేటాడటానికి, రాళ్లతో కొట్టడానికేనా..? నిన్ను సీఎంని చేసిందని ప్రశ్నించారు. తమకు ప్రజలను వెంటాడే.. వేటాడే సీఎం అవసరం లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.