సోమవారం నాడు మిర్యాలగూడలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ కాన్వాయ్‌పై పోలీసులు ఉండగానే.. దాడి జరగడంపై కన్నెర్రచేస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు రైతుల ముసుగు వేసుకుని ఈ దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. సోమవారం సాయంత్రం బండి సంజయ్ కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటనను గవర్నర్ తమిళిసైకి వివరిస్తూ.. పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం బీజేపీకి చెందిన నేతలు గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. అనంతరం దాడి సమయంలో పోలీసుల వ్యవహార శైలిపై ఫిర్యాదు చేస్తూ.. వానాకాలం పంటను కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని గవర్నర్‌కు వివరించారు. ఈ భేటీకి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్‌తో పాటుగా.. డీకే అరుణ, లక్ష్మణ్, గరికపాటి, విజయరామారావు, పొంగులేటి తదితరులు హాజరయ్యారు.