“ముఖ్యమంత్రి పీఠం కన్నా
జైలుకు వెళ్లి రావడమే గొప్ప అనుభూతి”
అని ప్రకటించిన రామ భక్తుడు..
హాజరు శాతంలో “ఎస్.. సార్ “కు బదులుగా
” వందేమాతరం” పలికించిన దేశభక్తుడు..
పార్టీ వీడినా..
సిద్ధాంతాన్ని వదలని స్వయంసేవకుడు..
కళ్యాణ్ సింగ్… దాదాపు అయిదు వందల సంవత్సరాల పాటు సాగిన అయోధ్య రామజన్మభూమి ఉద్యమ పోరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహనీయుడు పేరు ఇది.2020 ఆగస్టు 5న అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన భూమి పూజకు, 28 సంవత్సరాల ముందే అంకురార్పణ చేసిన కరడుగట్టిన కాషాయ వాది. విపక్షాలు, ధర్మ వ్యతిరేకులు సెక్యులర్ ముసుగు వేసుకొని సంధించిన విమర్శనాస్త్రాలను ఏమాత్రం లెక్క చేయని అసలు సిసలైన రామభక్తుడు. 1991లో తాను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసే సమయంలో.. రామజన్మభూమి సందర్శించి ఇచట భవ్యమైన మందిర నిర్మాణమే నా ధ్యేయం అంటూ రాములవారి ఎదుట ప్రతిజ్ఞ చేసిన కర సేవకుడు. తాను బతికుండగా అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయితే చూసి తరించి, తనువు చాలించడమే తన చిరకాల కోరిక అని మనసులోని మాటను చెప్పిన రామ భక్తుడు కళ్యాణ్ సింగ్.
బాల్యంనుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయం సేవకుడిగా జీవితాన్ని ఆరంభించిన కళ్యాణ్ సింగ్ హిందుత్వ వాదిగా అడుగు ముందుకు వేశారు. కొన్నాళ్లపాటు ప్రచారక్ గా పనిచేసిన తర్వాత, తన 30వ యేట బారతీయ జనసంఘ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పది సార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా.. రెండుసార్లు ఎంపీగా.. రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన కళ్యాణ్ సింగ్ ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా హిందుత్వ వాదాన్ని వీడక పోవడం గొప్ప విషయం. 1980వ దశకం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అయోధ్య ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ.. మొదటి తరంలో అద్వానీ, వాజపేయి తర్వాత కళ్యాణ్ సింగ్ తన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం అనే సమస్త హిందూ లోకం స్వప్నానికి ఉత్తరప్రదేశ్ ను వేదిక చేసి, భారత రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన ఘనత అతనిదే. నిరాయుధులుగా.. భావ పూర్వకంగా .. చట్టబద్ధంగా అయోధ్య వెళ్ళిన కరసేవకులు, రామ భక్తులపై ఒక్క లాటి దెబ్బ కూడా పడనివ్వలేదు. అంతకుమించి 1992 డిసెంబర్ 6న రామ మందిరం పై వివాద కట్టడాన్ని తొలగించే సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉండటం గర్వకారణం అంటూ చెప్పిన కట్టర్ కరసేవకుడు కళ్యాణ్ సింగ్.
కూల్చివేత ఘటనకు నేనే బాధ్యుణ్ణి.. !
ఉత్తర ప్రదేశ్ లో షెడ్యూల్ కులాల వేదికగా కాన్షీరామ్, మాయావతి దూసుకు వస్తుండగా.. వారి ప్రవాహాన్ని నిలువరించి నిలబడ్డ బీసీ నేత అతను. ఢిల్లీ పీఠం ఎక్కాలంటే, దేశానికి గుండెకాయ అయినటువంటి ఉత్తర ప్రదేశ్ ను చేజిక్కించుకోవాలి. అందులో భాగంగానే నాడు 1980వ దశకంలో పార్టీకి కళ్యాణ్ సింగ్ గట్టి పునాదులు వేశారు. ఆ పునాదుల పైనే నేడు విజయ కోటలు నిర్మాణమయ్యాయి. నగరాలలో నివసించే అగ్రవర్ణాలు, ధనవంతులకు మాత్రమే బిజెపి అడ్డా అనే విమర్శను చెరిపేస్తూ.. పేదలు, రైతులు , బీసీల పార్టీగా బీజేపీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో ఆయన సఫలీకృతమయ్యారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ గారు 1992లో నిర్వహించిన రథయాత్ర సమయంలో లో బాబ్రీ మసీదుకు ఎలాంటి హానీ జరగనివ్వనని సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. అయితే రామ మందిరం పై బాబరు కట్టిన వివాద కట్టడాన్ని ధ్వంసం చేసిన వెంటనే నికార్సైన హిందువుగా నిలబడ్డారు. జరిగిన ఘటనకు సంపూర్ణమైన బాధ్యత తనదేనని గర్వంగా ప్రకటించి భావితరాలకు స్ఫూర్తి గా నిలిచారు. ఆ సమయంలో కళ్యాణ్ సింగ్ సీఎం కాకుండా మరెవరు సీఎంగా ఉన్నా అంతటి ధైర్యం చేసేవారు కాదనేది జగమెరిగిన సత్యం. అయోధ్యలో రాముడి గుడి కట్టేందుకు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించి, 1994 అక్టోబర్ లో ఒకరోజు తీహార్ జైల్లో శిక్ష కూడా అనుభవించారు. “బాబ్రీ మసీదు విధ్వంసానికి నేను ఒక్కడినే బాధ్యుడిని.. మిగతా ఏ అధికారి కి ఎటువంటి సంబంధం లేదు” అంటూ సుప్రీం కోర్టు నియమించిన లిబర్హాన్ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇవ్వడం విశేషం. తాను ముఖ్యమంత్రిగా పని చేయడం కన్నా, రామజన్మభూమి విషయంలో జైలుకు వెళ్లి రావడమే గొప్ప అనుభూతి, సంతోషాన్ని కలిగించిందని ప్రకటిం చారు. హిందువునని చెప్పుకోవడంలో మొహమాటం ప్రదర్శించి, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని గర్జించారు. దీంతోనే సుప్రీం కోర్టు ఆయన కు ఒక రోజు జైలు శిక్ష విధించింది.
హాజరు శాతంలో వందేమాతరం పలకాలి
1991 నుంచి 92 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ రెండోసారి 1997 సెప్టెంబర్ నుంచి 1999 నవంబర్ వరకు సీఎంగా కొనసాగారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామ మందిరం పై బాబరు కట్టిన వివాద కట్టడాన్ని తొలగించడం ఒకటైతే .. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక “విద్యార్థులు విద్యాలయాల్లో హాజరు శాతం తీసుకునే సందర్భంలో ఎస్.. సార్.. అనకుండా వందేమాతరం అనాలి” అని నిబంధన తీసుకువచ్చిన భరతమాత ముద్దుబిడ్డ కళ్యాణ్ సింగ్. తాను ముఖ్యమంత్రిగా పని చేసింది కేవలం మూడున్నర సంవత్సరాలే అయినా, అనేక ప్రజారంజక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను చూరగొన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు కళ్యాణ్ సింగ్ ప్రభా ఉత్తరప్రదేశ్ మొత్తం కొనసాగింది. సువిశాలమైన ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ స్థానాలు కేవలం రెండే ఉండేవి. ఆ రెండు సీట్ల నుంచి 180 సీట్ల దాకా తీసుకువచ్చిన ఘనుడు అతను. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో 21 నెల లపాటు జైలు జీవితం అనుభవించారు. అయోధ్య ఘటనలో ఆయనపై నమోదైన కేసు ఇటీవల 2020 సెప్టెంబర్ 30న సిబిఐ కోర్టు కొట్టివేసింది.
పార్టీ వీడినా.. సిద్ధాంతాన్ని వీడలేదు..!
వ్యక్తిగత కారణాల వల్ల రెండుసార్లు పార్టీకి దూరమై మళ్లీ చేరువయ్యారు. తాను స్థాపించిన జన క్రాంతి పార్టీని 2010లో భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. పరిస్థితులు అనుకూలించక పార్టీకి దూరమైన క్రమంలో కూడా ఏరోజు సిద్ధాంతాన్ని వీడలేదు.. హిందుత్వానికి దూరంగా బతకలేదు. అంతటి నిష్ఠ వంతుడి జీవితం భావితరాలకు ఆదర్శం. ప్రస్తుతం ఆయన కుమారుడు రాజు వీర్ సింగ్ పార్లమెంట్ సభ్యుడిగా, మనవడు సందీప్ సింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
ఉపాధ్యాయుడుగా జీవితం ప్రారంభించిన అతను ఆర్ఎస్ఎస్ ద్వారా మల్ల యుద్ధం లో ప్రావీణ్యం సాధించారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమం లో కళ్యాణ్ సింగ్ పేరు తెలియని వారు లేరు. అయోధ్య ఉద్యమం తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో దేశమంతా పర్యటించి, కర సేవకులను , రామ భక్తులను చైతన్య పరిచారు. అందులో భాగంగానే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొత్తకోట లో గల అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి గారి ఇంట్లో భోజనం చేసి, అలంపూర్ ను దర్శించడం, తరువాత నాగర్ కర్నూల్ లో బస చేయడం తాము దగ్గరుండి చూశామని కరసేవకులు గుర్తుచేశారు.
హైందవ సమాజానికి వారు చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది.
ఉత్తరప్రదేశ్ లో 1932 జనవరి 5వ తేదీన తేజ్ పాల్ సింగ్, సీతా దేవి దంపతులకు జన్మించిన కళ్యాణ్ సింగ్.. 89 సంవత్సరాల వయసులో శివైక్యం చెందడం కరసేవకులను కలచి వేసే విషయం.
(శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన కళ్యాణ్ సింగ్ గారి అంత్యక్రియలు సోమవారం ముగిశాయి)
పగుడాకుల బాలస్వామి
ప్రచార సహ ప్రముక్, విశ్వహిందూ పరిషత్
9912975753
9182674010